కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు రుణ మాఫీపై కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. తాజాగా కోదాడలో ఓ బ్యాంక్ ముందు రైతులు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. బ్యాంక్ ముందు ఉన్న గేటు వద్ద కూర్చొని తమకు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. ఆ రైతులపై బ్యాంక్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడకు చేరుకున్న మహిళా పోలీస్ అధికారి రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. ధర్నా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది..? లక్ష రూపాయల రుణమాఫీ కోసం ఇంత చేస్తున్నారా..? అయితే మిమ్మల్ని జైలులో వేస్తా అదే లక్ష రూపాయలు పెట్టి కోర్టులకు తిరుగుతా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చారు మహిళా పోలీస్ ఆఫీసర్. అంతేకాకుండా రైతులందర్నీ కస్టడీలోకి తీసుకోవాలని తన పోలీస్ సిబ్బందికి సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లక్ష రూపాయల రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయలు ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన? అంటూ రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు కేటీఆర్. తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. రుణమాఫీ చేయండి అని బ్యాంకుకు వెళ్తే ఇలాంటి మాటలా? లక్ష రూపాయల రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయల ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన…? అంటూ ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా కాంగ్రెస్‌ను విమర్శించారు.
ప్రభుత్వం చేసిన తప్పిదానికి రైతులను కరడుగట్టిన నేరస్థులుగా పరిగణిస్తున్నందుకు సీఎం బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను!. మీరు మీ వాగ్దానాలను అందించడంలో విఫలమయ్యారు. మీరు ఇచ్చిన హామీని తీర్చాలని వచ్చినప్పుడు వారిని అరెస్టు చేస్తారా?. అలాగే కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మీకు ఆహారం ఇచ్చే చేతులను గౌరవించడం నేర్చుకోండి!’ అంటూ కామెంట్స్ చేశారు.