తెలంగాణలో కొలువుల జాతర..

తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ శాఖలలో 55వేల 418 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయం తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు.. ప్రభుత్వ సేవలను మరింత బలోపేతం చేయడంలో కీలకమైన అడుగుగా పరిగణించబడుతోంది. 15 నెలల్లో ఇప్పటికే 58,868 పోస్టులను భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ కొత్త భర్తీతో కలిపి మొత్తం 1.14 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి రికార్డు క్రియేట్ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.

వివిధ శాఖలలో మొత్తం 55వేల418 ఖాళీలు భర్తీ కానున్నాయి. రెవెన్యూ శాఖలో 10వేల954 గ్రామ పాలన అధికారుల పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో 6 వేల మంది ప్రస్తుత వీఆర్వోల నుంచి నియమించబడగా, మిగిలిన 4 వేలు కొత్త పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో 6వేల399 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు, 7వేల837 అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులు భర్తీ చేయబడతాయి. ఇవి గ్రామీణ ఉపాధి , శిశు సంరక్షణలో ముఖ్యమైనవి.

విద్యా శాఖకు సంబంధించి గురుకులాలులో సుమారు 30వేల228 ఖాళీలు, ఇవి గురుకుల విద్యా సంస్థలలో నాణ్యమైన విద్యను అందించడంలో సహాయపడతాయి. ఇతర శాఖలలో గ్రూప్‌ 1, 2, 3, 4, ఇంజనీరింగ్‌ సర్వీసెస్, టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ , ఇతర ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌లో ఖాళీలుండగా.. ఇవి వివిధ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలను కల్పిస్తాయి. ఈ భర్తీ ప్రక్రియ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా కానీ సంబంధిత శాఖల రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ద్వారా కానీ జరిగే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన తేదీలు అధికారికంగా ప్రకటించబడాల్సి ఉంది.

ఈ ఖాళీలకు అర్హతలు పోస్టుల రకాన్ని బట్టి ఉంటాయి . గ్రూప్‌ 1, 2, 3, 4 పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ లేదా సంబంధిత డిగ్రీ అవసరం. టీచర్‌ పోస్టులకు B.Ed, D.Ed, లేదా సమానమైన అర్హతలు ఉండాలి. ఇంజనీరింగ్‌ పోస్టులకు B.Tech, డిప్లొమా, సంబంధిత టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌ ఉండాలి.అంగన్‌వాడీ పోస్టులకు 10వ తరగతి లేదా 12వ తరగతి పూర్తి చేయాలి.కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 55వేల418 పోస్టుల భర్తీ నిర్ణయంపై తెలంగాణ యువత హర్షం వ్యక్తం చేస్తోంది.