కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని బాధగా అనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీలో భజన బ్యాచ్ ఎక్కువైపోయిందన్నారు. లోపల ఒకరినొకరు తిట్టుకొని బయట మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. అసలు అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడే నాయకులే లేరని, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాలన్న ఆలోచన కూడా వారికి ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల జరుగుతున్న తీరుపై ప్రధానంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అంతా మిత్రులు అయితే.. ప్రజలే శత్రువులా అని ప్రశ్నించారు. ప్రజల ఘోష నేతలకు వినపడడం లేదన్నారు.కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చకు పెట్టడం.. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో పాటు.. బీజేపీపై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో అసెంబ్లీ మీదుగా వెళ్లేటప్పుడు ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వెళ్తానా అని అనుకునే వాడినని, ప్రజలకు ఎమ్మెల్యేలు మంచి చేస్తారని భావించే వాడినని గుర్తుచేసుకున్నారు. కానీ, కొందరు జీతాలు తీసుకుని కూడా అసెంబ్లీకి రావడం లేదని, మరికొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇద్దరు నాయకులు మాట్లాడితే మిగతా 60 మంది వారికి భజన చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతమాత్రాన తానేం సత్యహరిశ్చంద్రుడిని కాదని చెప్పుకొచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన తనకు సభలో ఎలా వ్యవహరించాలో తెలుసని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో తెలంగాణకు ఏమి ఇచ్చిందో జీవోలతో సహా చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత కేసీఆర్ హయాంలో బీఆర్‌ఎస్‌కు 12 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు తీసుకొచ్చారో కేటీఆర్ వెల్లడించాలన్నారు. గత ప్రభుత్వానికి చేతకాక రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టలేదని.. ఇప్పుడున్న సీఎం ఏం చేస్తున్నారని వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY