జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ వ్యూహరచనలో కీలక అడుగులు వేస్తున్నారు. ఈరోజు ఆయన కేటీఆర్, హరీష్ రావులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల ప్రచారం, రోడ్‌షోలు, జనసమావేశాలు, పార్టీ బలపరచడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయావకాశాలను పెంచడానికి కేటీఆర్, హరీష్ రావు సమన్వయంతో సమగ్ర ప్రచార ప్రణాళిక రూపొందించనున్నారు.
స్థానిక నాయకుల సూచనలు, ప్రజాభిప్రాయం ఆధారంగా ప్రచార వ్యూహాలను సవరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగా కేసీఆర్ ేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కూడా భేటీ కానున్నారు. సిట్టింగ్ స్థానం కావడంతో బీఆర్ఎస్ పార్టీ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా తమ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని తీవ్ర కసరత్తులు చేస్తోంది.
మరోవైపు జూబ్లీహిల్స్ ఫలితాలు రాబోయే గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం చూపవచ్చని భావనతో, పార్టీ అధిష్ఠానం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దగా బయటకు కనిపించని కేసీఆర్ ప్రజా మద్దతు తిరిగి పొందేందుకు స్వయంగా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు శుక్రవారంతో ముగుస్తుంది. నవంబర్ 11న పోలింగ్ జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడనున్నాయి.