ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ అగ్రనేత, రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నిస్తోంది. ఈ కేసులో నిధుల మళ్లింపు, ఆర్థిక లావాదేవీల అవకతవకలపై కేటీఆర్‌ను ఈడీ విచారిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు వద్ద కేటీఆర్ విచారణ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కేటీఆర్ ఈడీ ఆఫీసుకు చేరుకోగానే, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడకు తరలివచ్చాయి. కేటీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ, కొందరు కార్యకర్తలు ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు పలు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేయబడాయి. గన్‌పార్క్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించారు. కేవలం ఆయ్‌కర్ భవన్ మార్గం మీదుగా వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.
ఈ కేసులో కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులను ఈడీ ఇప్పటికే విచారించింది. ఫార్ములా ఈ రేసు ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, ఆర్బీఐ అనుమతులు లేకుండా నిధుల మళ్లింపుపై చర్చించారు. బీఎల్‌ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్‌ల స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈడీ కేటీఆర్‌ను ప్రశ్నిస్తోంది. లావాదేవీలపై పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కేటీఆర్ కారు ఈడీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో వందలాది కార్యకర్తలు కారు చుట్టుముట్టి, నినాదాలు చేశారు. పోలీసులు వారిని అతి కష్టం మీద తరలించారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. “పోలీసు జులుం నశించాలి” అంటూ కొందరు నేతలు నినాదాలు చేశారు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నిధుల మళ్లింపు, ఆర్బీఐ అనుమతులు లేకుండా లావాదేవీలు జరిపిన తీరు ఈడీ దర్యాప్తు కేంద్రంగా మారింది. కేటీఆర్‌కు సంబంధించి అవకతవకలపై ఈడీ కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ కేసు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, ఈడీ దర్యాప్తు చర్యలతో కేటీఆర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. కేసు పూర్వాపరాలపై పూర్తి స్పష్టత రావడానికి ఇంకా సమయం పడే అవకాశముంది.