తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప ఆక్టివ్ కేసులు, అతి తక్కువ మరణాల రేటు, ఎక్కువ రికవరీలు నమోదయ్యాయని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉంది. అయినా ఒక పక్క చలి తీవ్రత పెరిగింది మరో పక్క జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సమయంలో జాగ్రత్తలు పాటించాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారం రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండాలి. తెలియకుండా సెకండ్ వేవ్ కి కారణం కాకండి. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి. అనుమానం ఉన్నవారు, లక్షణాలు కనిపించిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి” అని పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు డాక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
“మరోవైపు వాక్సిన్ సాఫ్ట్ వేర్ (కోవిన్) డ్రై రన్ కి రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రప్రభుత్భం ఎంపిక చేసింది. రాష్ట్రంలో డ్రై రన్ నడుస్తుంది. బోగ్గులకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర బృందం డ్రై రన్ నిర్వహిస్తుంది. మొదటి దశలో వాక్సిన్ ఇచ్చేందుకు లిస్ట్ సిద్దం చేశాము. వాక్సిన్ మొదటి డోసు ఇచ్చిన 3 వారాల తరువాత మళ్లీ ఇంకో డోసు వాక్సిన్ ఇవ్వాలి. ఇచ్చిన తరువాత 9 నెలల పాటు దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి అందరికీ వాక్సిన్ పూర్తి స్థాయిలో అందించడానికి సమయం పడుతుంది” అని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి మాట్లాడుతూ, “జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా సెకండ్ వేవ్ వస్తుంది. నవంబర్ లో చాలా తక్కువ కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సరియైన జాగ్రత్తలు పాటించని వారికి కరోనా సోకే అవకాశం ఉంది. గాంధీలో 900 కేసులు ఉండేవి ఇప్పుడు 135 మంది మాత్రమే ఉన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 90 % బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ఆక్సిజన్ సిలిండర్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 1600 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సహకరిస్తే తప్ప సెంకండ్ వేవ్ నుండి బయటపడలేము. కరోనా సోకిన వారు చాలామంది ఇతర ఆరోగ్య సమస్యలతో రెండు నెలల తరువాత హాస్పిటల్స్ కి వస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సోకిన వారు 3 నెలల నుండి సంవత్సరం పాటు డాక్టర్ ల పర్యవేక్షణలో ఉండాలి. కాబట్టి కరోనా సోకకుండా చూసుకోండి. వాక్సిన్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ సేవలు మొదలు పెట్టాము. అన్ని శస్త్ర చికిత్సలు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాము. మెడికల్ కాలేజ్ క్లాసులు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ