తెలంగాణలో మందుప్రియులకు చేదువార్త. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. సర్వర్ ప్రాబ్లమ్ వల్ల సరఫరా ఆగిపోవడం తో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్సైజ్‌శాఖ సాఫ్ట్‌వేర్ రెండ్రోజులుగా మొరాయిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోల నుంచి వైన్స్, బార్లకు వెళ్లాల్సిన లిక్కర్ సరఫరా నిలిచిపోయింది. గత రెండ్రోజులుగా ‘సీటెల్’ ప్రతినిధులు రంగంలోకి దిగి సమస్యను చక్కదిద్దే పనిలో నిమగ్నమైనా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో మ్యానువల్‌గా మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అనేవి అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా జరుగుతుందనే విషయం చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తుందంటే దానికి కారణం మద్యం అమ్మకాలే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తుంటుంది. పండగ వేళలో, ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయి.
ఇది ఇలావుండగా, తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం మద్యం ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఎక్సైజ్‌శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. హార్డ్ మద్యంపై రూ.10 నుంచి రూ.90, బీరుపై రూ.15-20 పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేస్తోంది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువ.. ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ రేట్లు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్యం ధరలు పెంచితే రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
తొలుత మద్యం ధరలు పెంచొద్దని భావించినా.. ఇతర రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర ఆదాయం తగ్గిపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల మద్యం విక్రయాలతో తెలంగాణ దేశంలో టాప్ ఫ్లేస్‌లో నిలవటం గమనార్హం. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది తెలంగాణలో సగటున ఒక వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేసినట్లు తెలిసింది. ఏపీలో సగటున రూ.1,306 వెచ్చించినట్లు నివేదికలు వెల్లడించాయి.