మీర్ పేట్ మర్డర్ కేసులో..కిరాతక హత్య అనే పదం చిన్నది అవుతుంది. నరహంతకులు సైతం ఆశ్చర్యపోయేలా చేసిన బ్రూతల్ హత్య ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతోంది. తన భార్యను చంపానని నిందితుడు గురుమూర్తి కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. చంపానని..కాల్చానని..కాల్చిన పొడిని చెరువులో పడేసానని అన్నీ ఒప్పుకున్నాడు. నిందుతుడు కళ్ల ముందే ఉన్నాడు .. కానీ ఆధారాలు లేకుండా చేయడంతో ఈ కేసు హైదరాబాద్ పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది. ఎవిడెన్స్ లభ్యం కాకపోవడంతో ఈ కేసును పోలీసులు ఎలా చేధిస్తారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుంది.
హైదరాబాద్ మీర్పేట్ మాధవి మర్డర్ కేసు ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు పెద్ద సవాల్‌ను విసురుతోందనే చెప్పాలి. నిందితుడు గురుమూర్తి.. తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నా..దానిని మర్డర్ అని నిరూపించడం ఎలా అనే దానిపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటి వరకూ ఎవరూ చేయలేని విధంగా క్రూరంగా గురుమూర్తి తన భార్యను హత్య చేసి కాల్చి.. ఎముకలను పొడి చేసి.. చెరువులో పడేయడంతో ఒక్క ఆనవాళ్లు కూడా దొరకలేదు.
దీంతో పోలీసులు కేవలం టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆధారంగానే మీర్పేట్ కేసును చేధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ దిశగానే హైదరాబాద్ పోలీసులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మూడు రోజుల దర్యాప్తు తర్వాత గురుమూర్తి కిచెన్‌లో రెండు కీలక ఆధారాలు సేకరించారు. మాధవి శరీరాన్ని కాల్చిన ఆనవాళ్లతోపాటు.. ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా ఇంట్లో రక్తపు మరకలను గుర్తించారు. వాటినుంచే డీఎన్ఏ శాంపిల్స్ సేకరించిన పోలీసులు..మాధవి పిల్లల డీఎన్ఏతో సరిపోల్చడానికి టెస్ట్ చేయబోతున్నారు.
మరోవైపు గతంలో ఎన్నడూ ఇలాంటి హత్య జరిగిన దాఖలాలు లేకపోవడంతో.. ఇతర ప్రాంతాల్లో ఇలాంటి హత్యలు ఎక్కడైనా జరిగాయా? అని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ అలాంటి హత్య జరిగితే అక్కడి పోలీసులు, అధికారులు ఎలా చేధించారనేదానిపై దృష్టి పెట్టారు . ఈ మర్డర్‌లో ఆధారాలు లేకపోవడంతో కేవలం టెక్నికల్ అంశాలతోనే కేసును సాల్వ్ చేయాలి కాబట్టి..పొరుగు రాష్ట్రాల నిపుణులు పిలవబోతున్నారు. ఇప్పటికే మర్డర్ జరిగిన తీరుపై కొంత క్లారిటీకి వచ్చిన పోలీసులు.. పొరుగు రాష్ట్రాల ఎక్స్పర్ట్స్ సాయంతో ఈ కేసును ఎలా సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.