తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల దీనికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్‌పై పలు విమర్శలు చేశారు. ఈ డ్రగ్స్ కేసులో కేటీఆర్‌కు ప్రమేయం ఉందని ఆరోపించారు. దీంతో మంత్రి కేటీఆర్ మంగళవారం బండి సంజయ్ కామెంట్స్‌పై స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డ్రగ్స్ విమర్శలపై ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి డ్రగ్స్ తీసుకోవడం అలవాటు లేదని, దీనికోసం ఏ నమూనాలు కావాలన్నా ఇవ్వడానికి తాను సిద్ధమని అన్నారు. కావాలంటే డ్రగ్స్ టెస్టు కోసం తన గోర్లు, వెంట్రుకలు సహా రక్త నమూనాలు ఇస్తానని, అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇక్కడే ఉంటానని, పరీక్షల కోసం ఎంతమంది వైద్యులను అయినా తెచ్చుకోవచ్చని సూచించారు. అయితే పరీక్షల అనంతరం ఫలితాల్లో తాను డ్రగ్స్ వినియోగించలేదని తేలితే, తనపై చేసిన ఆరోపణలకు బండి సంజయ్ కరీంనగర్ కమాన్ వద్ద చెప్పు దెబ్బలకు సిద్ధమేనా? అని కేటీఆర్ సవాల్ చేశారు. దీనికి సంబంధించి నిర్ధారణ పరీక్షల కోసం తాను శాంపిల్స్ ఇస్తానని, అదే సమయంలో ప్రధాని మోదీని కూడా శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా కోరతానని స్పష్టం చేశారు. ఇక తప్పుడు ఆరోపణలతో నాయకులను కించపరచడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని, అయితే ఇలాంటి వాటిని తాను లెక్కచేయనని అన్నారు. అలాగే తనపై పోటీ చేసి గెలవాలంటే చేయాల్సింది ఆరోపణలు కాదని, తనకన్నా ఓ రెండు మంచి పనులు ఎక్కువ చేసి ఓట్లు అడగాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ