నగరంలోని వివిధ ప్రాంతాలలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం క్రింద నిర్మించిన ఇండ్ల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు శుభవార్త. వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న 2336 జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్లను అర్హులైన లబ్దిదారులకు అందజేయడం ద్వారా వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతనిశ్చయం తో ఉన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారిలను పిలిపించుకొని జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ ల పరిధిలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో హమాలీ బస్తీ, సనత్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గైదన్ బాగ్ కస్తుర్బా నగర్, ఓల్డ్ పాటిగడ్డ, ఎన్బీటీ నగర్ లలో, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎల్ఐసీ కాలనీలో, అంబర్ పేట్ నియోజకవర్గ పరిధిలోని వీరన్నగుట్ట, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గ పరిధిలోని సర్వే నెం 82, 128, 83, ఉప్పుగూడ ఎక్స్ సర్వీస్ మెన్ ప్రాంతాలలో, గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని పూల్ బాగ్ -1,2 మలక్ పేట నియోజకవర్గ పరిధిలోని నందనవనం-2, ముంగనూర్ తదితర 16 ప్రాంతాలలో 2006-2008 సంవత్సరాల మధ్యకాలంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం క్రింద 10,178 ఇండ్లను నిర్మించడం జరిగిందని చెప్పారు. వీటిలో 2336 ఇండ్లను లబ్దిదారులకు కేటాయించే అంశం వివిధ కారణాలతో సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉందని అన్నారు.
ఎంతోమంది నిరుపేదలు ఉండేందుకు సరైన ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇండ్లను నిరుపయోగంగా ఉంచడం వలన ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇండ్ల కేటాయింపు కోసం లబ్దిదారులు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా పెండింగ్ లో ఉన్న ఇండ్లను అర్హులకు కేటాయించడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే ఆయా నియోజకవర్గాల కు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి అర్హులైన లబ్దిదారులకు ఇండ్లను కేటాయించే విషయమై చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ