బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుధీర్ఘ విరామం తరువాత తన తండ్రి కేసీఆర్ ను కలుసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ విడుదలయి నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్న కవిత ఈరోజు ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఇక తన కన్నబిడ్డ కల్వకుంట్ల కవితను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు తండ్రి కేసీఆర్. బెయిల్ పై విడుదలయి బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కళ్ళలో ఆనందం కనిపించింది. అటు తండ్రి పాదాలకు నమస్కరించారు కల్వకుంట్ల కవిత… ఆయన చేతికి ముద్దు పెట్టారు. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించిన కేసీఆర్…కల్వకుంట్ల కవితతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కవిత భర్త అనిల్, కుమారుడు కూడా అక్కడ ఉన్నారు. తమ అధినేత సంతోషంలో పార్టీ నాయకులు, సిబ్బంది భాగస్వామ్యం అయ్యారు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషం వెల్లివిరిసింది. ప్రస్తుతం కవిత 10 రోజులపాటు కేసీఆర్ తో పాటు ఫామ్ హౌస్ లోనే ఉండనున్నట్లు సమాచారం.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆమెకు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెకు రెండు రోజుల కిందటే బెయిల్ లభించింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొన్నారు కవిత. బెయిల్ లభించిన రోజు రాత్రే తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె వెంట భర్త అనిల్ కుమార్, అన్న కేటీఆర్, మేనమామ హరీష్ రావు, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఆర్ఎస్ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
తాజాగా- విడుదలైన తరువాత సోషల్ మీడియాలో తొలి పోస్ట్ పెట్టారు కవిత. దాదాపు 165 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన కవిత తొలిసారిగా ట్వీట్ చేశారు. సత్యమే గెలిచిందని ‘సత్యమేవ జయతే’ అంటూ పోస్ట్ పెట్టారు. దీనికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తన నివాసానికి చేరుకున్న అనంతరం భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి అభివాదం చేసిన ఫోటోను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతోన్నాననే సందేశాన్ని ఇచ్చారు. కాగా కవిత చివరిసారిగా మార్చి 14న ట్వీట్ చేశారు. యాదాద్రి ఆలయం ఫోటో పేపర్ క్లిప్ షేర్ చేస్తూ.. ‘దేవుడు శాసించాడు.. కేసీఆర్ నిర్మించాడు’ అని ట్వీట్ చేశారు.