మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం, క్రిమినల్ కేసులు వేశారు. అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపు ఘాట్ వద్ద మంత్రి కొండా సురేఖ పరువు నష్టం వ్యాఖ్యలు చేశారని హీరో నాగార్జున పిటిషన్‌లో వివరించారు. బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరువు నష్టం దావా దాఖలు చేశారు.’నాగచైతన్య డివోర్స్ 100 శాతం కేసీఆర్, కేటీఆర్ చేయబట్టే అయ్యింది.. ఎందుకంటే.. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చవద్దు అంటే..సమంతను నా దగ్గరకు పంపాలని అని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేశారు.. సమంతను వెళ్లమని చెప్పి నాగార్జున వాళ్లు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్లను అనింది. వెళ్లను అని చెబితే.. వింటే విను.. లేకపోతే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారు’ అని కొండా సురేఖ వ్యాఖ్యానించినట్టు నాగార్జున తన పిటిషన్‌లో ప్రస్తావించారు.
మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో హీరో నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో ఆయన మంగళవారం రోజు కోర్టుకు హాజరు కానున్నారు. నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పరిశీలించిన తర్వాత, అయన పిటిషన్‌లో పేర్కొన్న ఇద్దరు సాక్షులు సైతం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. వారి స్టేట్‌మెంట్‌లను సైతం మెజిస్ట్రేట్ రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత కోర్ట్ దానిని కాగ్నిజన్స్‌గా తీసుకుంటే మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు జారీ చేస్తుంది. కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత కొండా సురేఖ నుండి కోర్టు వివరణ కోరుతుంది. ఆమె వివరణ ఆధారంగా ఒక్కోసారి నేరుగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. తదనంతరం కోర్టు ఈ పరువు నష్టం దావా కేసుకు సీసీ నంబర్‌ను కేటాయిస్తుంది. సీసీ నంబర్ వచ్చిన తర్వాత కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది.
కాగా మంత్రి కొండా సురేఖ కామెంట్స్ కి సినీ పరిశ్రమ మొత్తం నాగార్జున కుటుంబానికి అండగా నిలబడింది. సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అంతా ఒక్క తాటిపైకి వచ్చి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి సురేఖ దిగి వచ్చారు.. అక్కినేని నాగార్జున మీద, నటి సమంత మీద వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ ఆమె చేసిన దారుణమైన వ్యాఖ్యలు మాత్రం క్షమార్హం కాదని ఫిలీం ఇండస్ట్రీ వర్గాలు, సినీ ప్రేక్షుకులు ముక్తకంఠంతో అంటున్నారు.