తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో షెడ్యూల్డ్ కాస్టుల (ఎస్సీ) ఉపవర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదనను ప్రకటించారు. 15% ఎస్సీ రిజర్వేషన్ను మూడు ఉపవర్గాలుగా విభజించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ నిర్ణయం, నవంబర్ 2024లో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ సిఫారసుల ఆధారంగా తీసుకున్నారు. ఈ కమిషన్కు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షత వహించారు.
ఎస్సీల ఉపవర్గీకరణ వివరాలు:
ఈ కమిషన్ తన నివేదికలో తెలంగాణలోని 59 ఎస్సీ కులాలను మూడు సమూహాలుగా విభజించాల్సిన అవసరం ఉందని సూచించింది.
గ్రూప్ 1: అత్యంత సామాజిక, ఆర్థిక, విద్యా దశల్లో వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్.
గ్రూప్ 2: కొంత మేరకు రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందిన 18 కులాలను చేర్చి 9% రిజర్వేషన్ కేటాయింపు. ఇందులో మాదిగ కులం కూడా ఉంది.
గ్రూప్ 3: రిజర్వేషన్ ద్వారా మెరుగైన ప్రయోజనాలు పొందిన మాలలు, ఇతర 25 కులాలకు 5% రిజర్వేషన్.
ఉపవర్గీకరణ అమలులో ప్రత్యేక విధానం
జాబ్ నోటిఫికేషన్లలో ఖాళీలు ఉంటే, వాటిని సమూహాల వారీగా క్రమంగా భర్తీ చేసే విధానాన్ని కమిషన్ ప్రతిపాదించింది.
గ్రూప్ 1లో ఖాళీలు భర్తీ కాకపోతే, గ్రూప్ 2 నుండి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అదే విధంగా, గ్రూప్ 2 ఖాళీలు నిండకపోతే, గ్రూప్ 3 అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
అన్ని గ్రూపుల్లోనూ అర్హులైన అభ్యర్థులు లేనిపక్షంలో, ఆ ఖాళీలు భవిష్యత్తుకు కొనసాగిస్తారు.
రిజర్వేషన్ అమలుకు కొత్త రోస్టర్ పాయింట్లు
కమిషన్ ప్రతిపాదించిన ప్రకారం, మొత్తం 59 ఎస్సీ కులాలకు ఈ ఉపవర్గీకరణ విధానం వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రోస్టర్ పాయింట్లను రూపొందించనుంది.
ఈ నిర్ణయం ఎస్సీ ఉపవర్గాలకు సమాన న్యాయం కల్పించే దిశగా ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.