హైదరాబాదులో వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఆఫీసులు, స్కూల్స్ నుంచి నగరవాసులు ఇంటికి వెళ్లే సమయంలో అయితే గంటల తరబడి ట్రాఫిక్ లోనే వాహనదారులు గడపాల్సి వస్తుంది.
దీంతో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్, జీహెచ్ఎంసీ, హైడ్రా, హెచ్‌ఎమ్‌డీఎ, రాచకొండ , సైబరాబాద్ పోలీసు అధికారులతో కలిసి సోమవారం ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
వరుసగా కురుస్తున్న భారీ వర్షాల సమయంలో హైదరాబాద్ ప్రధాన రోడ్లపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోతుంది.దీంతో ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం తక్షణ రెస్పాన్స్ అవసరమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీని కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకునేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశంలో అన్ని విభాగాల సమన్వయం తీసుకుని ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్య కూడళ్ల వద్ద డైవర్షన్లు అమలు చేయడం వంటివి చేయడంపై చర్చించారు. వీటితో పాటు వాతావరణ సూచనలు, ట్రాఫిక్ సలహాలను వేగంగా అందించడం, సమాచార ఫలకాలు అమలు చేయడం, నీరు నిల్వ ఉండకుండా నివారించడంతో పాటు రోడ్డుపై నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ఇంజినీరింగ్ మార్పులు చేయడం వంటి అంశాలను చర్చించారు.
ప్రతీ డిపార్టుమెంట్ తమ ప్రాంతాలలో ఇప్పటికే చేపడుతున్న చర్యలను, ఉన్న ప్రణాళికలను వివరించగా, ట్రాఫిక్‌ను తగ్గించడానికి తక్షణం అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళికలను చర్చించారు. ఉమ్మడి వర్క్‌షాప్ నిర్వహించడంతో పాటు మూడు పోలీస్ కమిషనరేట్‌ల ట్రాఫిక్ కమిషనర్, జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాలతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడంపైనా కూడా చర్చలు సాగాయి. అలాగే ఐటీ కంపెనీలతో సమన్వయం, టెక్నాలజీని ఉపయోగించడం, అన్ని విభాగాల కోసం ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్‌ను క్రియేట్ చేయడం వంటి అంశాలను ఈ సమీక్షలో చర్చించారు.
ఈ సమావేశంలో అదనపు సీపీ విక్రమ్ సింగ్ మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాటా, హెచ్‌ఎమ్‌డిఎ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ పీ.విశ్వ ప్రసాద్, రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మూడు పోలీస్ కమిషనరేట్‌ల చీఫ్‌లు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.