సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు రూ.8.6 కోట్లు మోసపోయిన ఘటన మరవకముందే మరో భారీ మోసం వెలుగు చూసింది. తాజాగా ఇండియాలోనే అతి పెద్ద సైబర్ మోసం.. హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఓ వృద్ధుడిని సైబర్ కేటుగాళ్లు నిండా ముంచారు. ఏకంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులో పేరుతో ఈ మోసానికి పాల్పడ్డారు. విశ్రాంత ఉద్యోగి వాట్సాప్‌కు ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ చిట్కాల పేరిట మెసేజ్ వచ్చింది. గతంలో షేర్లలో లాభాలు గడించిన అనుభవమున్న బాధితుడు స్పందించడంతో మోసగాళ్లు ఏఎఫ్‌ఎస్‌ఎల్, అప్‌స్టాక్స్, కంపెనీల పేరుతో లింక్‌లు పంపించి వాట్సాప్ గ్రూప్‌లో చేర్చుకున్నారు. సదరు రిటైర్డ్ ఉద్యోగికి గతంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన అనుభవం ఉండటంతో.. ఆ మెసేజ్ కు స్పందించాడు.
ప్రముఖ కంపెనీల లిస్టును అందులో పెట్టారు. ఆయా కంపెనీల ప్రతినిధులుగా తమను తాము పరిచయం చేసుకున్న సైబర్ మోసగాళ్లు బాధితుడికి షేర్ల గురించి వివరించారు. వారి మాటలు పూర్తిగా నమ్మిన బాధితుడు ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాడు. దీంతో బాధితుడు సైబర్ నేరస్థులను పూర్తిగా నమ్మి ఏకంగా రూ.13.26 కోట్లను బదిలీ చేశారు. అనంతరం వాళ్లు మొబైల్ స్విచ్చాఫ్ చేయటంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఈ నెల 2న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
ఈ క్రమంలో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కు చెందిన మెట్రో రైలు ఉద్యోగి మహ్మద్ అతీర్ పాషా(25) బ్యాంకు ఖాతాకు కొంత సొమ్ము బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో మరో ఇద్దరు యువకుల పాత్ర బయటపడింది. దీంతో హిమాయత్‌నగర్‌కు చెందిన అరాఫత్ ఖాలేద్ మొహియుద్దీన్(25), చార్మినార్ ఫతేదర్వాజాకు చెందిన సయ్యద్ ఖాజా హషీముద్దీన్(24) తనతో బ్యాంకు ఖాతా తెరిపించారని అతీర్‌పాషా చెప్పాడు. మ్యూల్(కమీషన్ కోసం బ్యాంకు ఖాతాను తెరవడం) అకౌంట్‌గా తన ఖాతాను వినియోగించుకున్నారని అతీర్‌పాషా చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.