చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను చేసుకుంటాం. దీపావళి అంటేనే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది టపాసులు. ఆ రోజు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ బాణసంచా పేల్చడానికి ఇష్టపడతారు.అయితే ఈ దీపావళి వేడుకల సందర్భంగా భారీ శబ్ధాలు పుట్టించే టపాకాయలపై హైదరాబాద్ పోలీసులు గతేడాదిలాగే నిషేధం విధించారు.
బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై ఎక్కువ డెసిబుల్ క్రాకర్లను పేల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచాను కాల్చుకోవడానికి అనుమతిని ఇచ్చారు.
ముఖ్యంగా సుప్రీంకోర్టు నిబంధనలకు కట్టుబడి ఉండేలా అనుమతించదగిన డెసిబెల్ స్థాయిలకు సంబంధించి పోలీసులు తాజాగా స్పష్టం చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పటాసులు విక్రయించే స్టాల్స్ యజమానులు లైసెన్స్ లేకుండా మతాబుల వ్యాపారం చేయకూడదని నార్త్ జోన్ డీసీపీ ఎస్ రష్మీ పెరుమాల్ తెలిపారు.
అక్టోబరు 26 నాటికి తెలంగాణ అగ్నిమాపక శాఖకు మతాబులు విక్రయించేందుకు లైసెన్సుల కోసం సుమారు 7వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 6,104 దుకాణాలకు అనుమతి ఇచ్చారు. 2023లో లైసెన్సుల కోసం 6,610 దరఖాస్తులు వచ్చాయి. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో అయితే బాణసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధించారు. అక్కడ తీవ్ర వాయు కాలుష్యం వల్ల అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ సమీపిస్తుండటంతో ఇప్పటకే హైదరాబాద్‌లోని మార్కెట్‌లతో పాటు ఎక్కడిక్కడ బాణా సంచా అమ్మే దుకాణాలు కళకళలాడుతున్నాయి.