ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించడానికి చెరువుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు.ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం కానీ ఇతర ప్రత్యామ్నాయం చూపించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆదేశించారు.
ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ , బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించడానికి వీటిని ఉపయోగించనున్నారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు.
దీంతో రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ..బుధవారం ఇంటింటికి వెళ్లి అక్కడున్నవారికి ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తారో తెలియజేయనున్నారు. దీనిలో భాగంగానే ముందుగా రివర్ బెడ్‌లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న వారిని అక్కడ నుంచి తరలిస్తారు.
మూసీ బఫర్ జోన్‌లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుంది. నిర్మాణ ఖర్చుతో పాటు వారికి పట్టా ఉంటే కనుక ఆ భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. వారికి డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కేటాయిస్తారు. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి మూసీ పరివాహక పరిసరాలలో పర్యటించారు.