హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే మెట్రోనే ప్రధానం మార్గం. ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణించాలంటే మెట్రోనే బెస్ట్ ఆప్షన్. మెట్రోతో ఉన్న సౌలభ్యాన్ని గమనించిన నగరవాసులు.. తమ ప్రాంతాల్లోనూ మెట్రో సేవలు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ సర్కారు మెట్రో విస్తరణపై దృష్టి సారించింది. అయితే ఇప్పుడు మెట్రో ప్రయాణికులకు దిమ్మతిగిరేలా చేదు వార్త చెప్పింది. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో.. నాగోల్ మెట్రో స్టేషన్లో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ఎత్తేసింది. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో మెట్రో ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు దర్శనం ఇస్తోంది. ఆగస్టు 14వ తేదీ నుంచి ఇక్కడ పార్కింగ్ ఛార్జీల వసూలు మొదలైంది. ఇక్కడ బైకులను 2 గంటల వరకు పార్కింగ్ చేస్తే రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. అదే 8 గంటల వరకు పార్కింగ్ చేయాలంటే రూ.25 చెల్లించాలి. 12 గంటల వరకు బైకులను పార్క్ చేయాలంటే రూ.40 కట్టాలి. అంటే హైటెక్ సిటీ ఏరియాలో ఉద్యోగం చేసే ఓ వ్యక్తి నాగోల్ స్టేషన్‌లో బైక్ పార్కింగ్ చేయడానికి రోజుకు రూ.40 చెల్లించుకోవాలన్న మాట. దీంతో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
ఈ రోజు ఉదయం పార్కింగ్ చేసేందుకు వెళ్లిన మెట్రో ప్రయాణికులు ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు చూసి అవాక్కయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. ఎప్పటిలాగే ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. చాలిచాలని వేతనాలతో జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉండలేక నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఉంటున్నామని, ఛార్జీలు కాకుండా అదనంగా పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ మెట్రో కొత్త రూల్స్ తీసుకురావడం దారుణం అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు రోజుకు రూ.40 అంటే నెలకు రూ.1200 వందలు చెల్లించాలని, దీని వల్ల తమ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని వారు వాపోయారు. చిరు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసే ఈ నిబంధన తొలగించి ఎప్పటి లాగానే ఉచిత సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ మెట్రోలో రోజుకు సుమారు 4నుంచి 5లక్షల మంది ప్రయాణిస్తున్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యలు లేకపోతే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. చాలా మంది ప్రయాణికులు తమ ఇంటి దగ్గర్నుంచి సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరకు వ్యక్తిగత వాహనాల్లో వస్తున్నారు. ప్రస్తుతం మెట్రో తీసుకున్న నిర్ణయంతో వీరందరిపైనా భారం పడనుంది. పార్కింగ్ ఫీజు చెల్లించేందుకు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలా డౌన్ లోడ్ చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పార్కింగ్ ఏరియా కూడా అధ్వానంగా ఉంటుందని, పైగా వాహనాలకు సైతం గ్యారెంటీ లేకపోతే పార్కింగ్ ఫీజు చెల్లించడంలో అర్థం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. వినియోగదారుల ఆందోళన నేపథ్యంలో మెట్రో అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.