దసరా పండగా సందర్బంగా టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ స్పెషల్ బస్సుల్లో టికెట్ చార్జీల మోత మోగడం తో ప్రయాణికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దసరా అనేది పెద్ద పండగ అని చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్న సరే దసరా వస్తుందంటే సొంత ఊర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా దసరా ను జరుపుకుంటుంటారు.
అయితే పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లోనే అదనంగా 25 శాతం చార్జీని ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నామని ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ బస్సుల్లో ఎటువంటి చార్జీలను పెంచలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదనపు చార్జీలను వసూలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని అందులో పేర్కొన్నారు. నగరం నుంచి తెలంగాణ, ఏపీలోని జిల్లాలకు వెళ్లే స్పెషల్ సర్వీసులకు ఈ చార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. ఈనెల 14 వరకు 6,300 స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆధార్‌కార్డు చూపించి మహిళలు ఉచిత ప్రయాణాలు చేయవచ్చని అధికారులు తెలిపారు. కాగా, గురు, శుక్రవారాల్లో ఏపీ, తెలంగాణ జిల్లాలకు 3 వేలకు పైగా స్పెషల్ బస్సులు నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
కానీ స్పెషల్ బస్సు ల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదివరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.310గా ఉంటే ఇప్పుడు రూ.360 తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండగకు ముందే బస్సు , ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటుంటారు. ఒక వేళ టికెట్ దొరకని వారు స్పెషల్ బస్సు లను , ట్రైన్ లను చూసుకుంటారు. ఇక ఈసారి కూడా దసరా సందర్బంగా గత వారం రోజులుగా బస్టాండ్ , రైల్వే స్టేషన్ లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారు హ్యాపీగా ప్రయాణం చేస్తుంటే..రిజర్వేషన్ చేసుకొని వారు మాత్రం నరకయాతన అనుభవిస్తుండగా ఈ స్పెషల్ బస్సుల చార్జీలు వారిని మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి.