సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టి సనాతన ధర్మం రక్షణ కోసం ఉద్యమిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఆందోళన కలిగించిందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇది దుర్మార్గమని, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతం వారైనా సామూహికంగా కాపాడుకోవాలన్నారు.
గత ఐదేళ్లలో ఏపీలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వాటిని నిలువరించేందుకు కఠిన చర్యలు అవసరమని చెప్పారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలను అపవ్రితం చేయడం అలవాటుగా మారింది. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమన్నారు. అందుకే తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో చెప్పానని పవన్ పేర్కొన్నారు. ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జనసేనాని సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేశారు.
హైదరాబాద్ సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. విగ్రహం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి విగ్రహాన్ని కాలితోతన్నుతూ ధ్వసం చేసారు. స్థానికులు ఓ నిందితుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా హిందూత్వ సంఘాలు ఈ సంఘటనను ఖండిస్తున్నారు..పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. బిజెపి నేతలు కిషన్ రెడ్డి , ఈటెల రాజేందర్ తదితరులు దీనిపై విచారణ వ్యక్తం చేసి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని.. ఇలాంటి ఘాటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు కోరారు.