తెలంగాణలో రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చుట్టూనే తిరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరమైన అంశాలపై సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే రేవంత్ పదే పదే ఢిల్లీ వెళ్లడం పై అటు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అవమానించేలా అప్పటి కాంగ్రెస్ వ్యవహరించిందని…ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ అదే పని చేస్తోందని… రేవంత్ రెడ్డికి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలంగాణ బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ విభాగం స్పష్టత కోరింది. తెలంగాణలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి సారథ్యమా.. లేక కాంగ్రెస్ హైకమాండ్ సారథ్యమా?.. మంత్రివర్గ విస్తరణ నిమిత్తం వారిని ఎప్పటికప్పుడు ఢిల్లీకి పిలిపించడం వెనుక నేపథ్యం ఏమిటి అని బీజేపీ ప్రశ్నిస్తోంది.
ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులతో కలిసి బీజేపీలో చేరతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రచారంలో జోస్యం చెప్పారు. ప్రధాని మోదీలైన్‌లోనే సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నడని… పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు కూడా. ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపిందని రేవంత్ రెడ్డి కూడా ఆరోపించారు. అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. తెలంగాణలోని ముఖ్యమైన పెండింగ్ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి ప్రధాని, హోంమంత్రిని కలిశారని సమాచారం. ఇరువురి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ప్రధాని మోదీని కలిశారు. ఈ భేటీ ముగిసిన వెంటనే రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా 55 మందితో పాటు బీజేపీలో చేరనున్నారని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడ కూడా జోరుగా పుకార్లు లేపుతున్నారు. అయితే రేవంత్ వర్గీయులు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.
ఇక రాజ్యసభ సభ్యుడు కూడా BRS సీనియర్ నాయకుడు కె. కేశవరావు ఆ పార్టీని వీడి మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా తన ఉనికిని చాటుకోవడం మొదలుపెట్టారు. తాను సూచించిన వ్యక్తికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీలో పట్టు సాధించేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. కాబట్టి బీజేపీలో చేరుతారనే వార్త ప్రస్తుతానికి పుకార్లేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డితో ప్రధాని మోదీకి మంచి బంధం ఉందని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ ఏ కారణం చేత పదే పదే ఆయనను ఢిల్లీకి పిలుస్తోంది? ఆయన రాజకీయ కార్యకలాపాలపై కాంగ్రెస్‌కు ఏమైనా అనుమానాలున్నాయా? అనేది కూడా ప్రస్తుతానికి ప్రశ్న.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF