ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ

Central Government on the ITIR Project, itir project in hyderabad, KT Rama Rao demands revival of ITIR, KTR, KTR urges Centre to reinstate ITIR project, KTR Writes a Letter to the Central Government, KTR writes to Centre for reinstating ITIR in Hyderabad, Mango News Telugu, Minister KTR, Minister KTR Writes a Letter to the Central Government, reinstating ITIR In Hyderabad, Telangana IT Minister KTR

ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 2014 నుంచి ఐటీఐఆర్ పైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానం లేదని, కనీసం ఇప్పటికైనా ఐటీఐఆర్ ను పునరుద్ధరించడం లేదా అంతకు మించి మేలైన మరోక కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 2008లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుందని, ఇందుకు సంబంధించి 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఐటీఐఆర్ కోసం 49000 ఎకరాలతో పాటు మూడు క్లస్టర్ లను హైదరాబాద్ లో గుర్తించడం జరిగిందని, తద్వారా అనేక నూతన ఐటీ కంపెనీలను నగరానికి రప్పించేందుకు, పెట్టుబడులకు ప్రోత్సాహకంగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. సుమారు 3275 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఇందుకు సంబంధించి రెండు దశల్లో ఈ నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన ఐటీఐఆర్ కార్యక్రమం పైన ఎలాంటి స్పందన లేదు:

ఇందులో భాగంగా మొదటి దశ కార్యక్రమానికి సంబంధించి 165 కోట్ల రూపాయలతో 2018 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని, మిగిలిన రెండవదశ కు సంబంధించి వివిధ దశలుగా 20 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఐటీఐఆర్ మొదటిదశలో భాగంగా గుర్తించిన పలు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రైల్వే మరియు రోడ్డు ట్రాన్స్ పోర్ట్ శాఖలకు సంబంధించి అదనపు బడ్జెట్ నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే వస్తున్నదని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పటి వరకు హైదరబాద్ లో ఐటీఐఆర్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు. 2014లో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐఆర్ ప్రాజెక్టు నమూనాని సమీక్షించి, మరింత మేలైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పారని, 2017లో ఇందుకు సంబంధించి ఐటీఐఆర్ భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరిపినా, ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాలేదని మంత్రి కేటీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఐటీఐఆర్ పైన ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు విజ్ఞప్తులు కూడా అందించారని, గత ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత కీలకమైన కార్యక్రమం పైన ఎలాంటి స్పందన రాలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటి రంగంలో గొప్ప వృద్ధి:

కేంద్ర ప్రభుత్వం నుంచి ఐటీ పరిశ్రమకు సంబంధించి ఇంతటి ప్రాధాన్యత కలిగిన అంశం పైన ఎలాంటి స్పందన లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటి రంగంలో గొప్ప వృద్ధిని తెలంగాణ సాధించిందని, 2014 లో ఉన్న 57258 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులను 2019- 20 నాటికి 1,28,807 కోట్ల రూపాయలకు పెరిగేలా చేశామన్నారు. మొత్తంగా తెలంగాణ గత ఆరు సంవత్సరాలు స్థూలంగా 110 శాతం వృద్ధిని సాధించిందని, ఇది జాతీయ సగటు కన్నా ఎంతో ఎక్కువ అని తెలిపారు. ఐటి ఉద్యోగుల సంఖ్య సైతం దాదాపుగా రెట్టింపు అయిందని, హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ వంటి సంస్థలు నగరాన్ని తమ పెట్టుబడులకు గమ్య స్థానంగా ఎంచుకున్నాయని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడంలోనే కాకుండా నూతన టెక్నాలజీ లైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాట అనలిటిక్స్, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీస్, గేమింగ్, యానిమేషన్, గ్రాఫిక్స్, బ్లాక్ చైన్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతున్నదని తెలిపారు.

దీంతోపాటు ఇన్నోవేషన్ రంగంలోనూ టి హబ్, టి వర్క్స్, వి హబ్, టాస్క్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను తెలంగాణ చేపట్టిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ పెద్ద ఇబ్బందులు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించగలిగాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎకనమిక్ స్లో డౌన్ వలన, కోవిడ్ సంక్షోభం వలన కంపెనీలు తిరిగి తమ పూర్వస్థితికి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ పథకాన్ని లేదా అంతకు మించి మెరుగైన కార్యక్రమాన్ని అందిస్తే ఐటీ పరిశ్రమకి దాని వృద్ధికి బలమైన ఊతం ఇస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చెబుతున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐఆర్ ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఐటిఐఆర్ ని పునరుద్ధరించడం ద్వారా తెలంగాణలో అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 6 =