డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలపై అధిక ప్రభావం చూపే వైద్య ఆరోగ్య శాఖకు ప్రాధాన్యతనిస్తూ, నిధుల కేటాయింపులో కీలక స్థానం కల్పిస్తామని తెలిపారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీ-బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు.
గత దశాబ్దంలో డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రభుత్వంలో ఈ మూడు విభాగాలను బలోపేతం చేయడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డ్రగ్స్ మరియు ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునీకరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం రాబోయే బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించి, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని మంత్రులు తెలిపారు. అలాగే, వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాల భవనాలు, ఆసుపత్రుల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అధికంగా వినియోగించుకునేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లాంటోరియంల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియాన చొంగతా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత తదితర అధికారులు పాల్గొన్నారు.