రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిన్న వరంగల్ పట్టణంలో నిర్వహించిన ‘రైతు సంఘర్షణ సభ’లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు రెండవ రోజు హైదరాబాద్ నగరంలో పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొంటున్నారు. నిన్న రాత్రి వరంగల్ సభ అనంతరం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో బస చేసిన రాహుల్ శనివారం ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారితో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు, మీడియా ముఖ్యులతో హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ తర్వాత సంజీవయ్య పార్కుకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మధ్యాహ్నం చంచల్ గూడ జైలుకి వెళ్లి పద్దెనిమిది మంది ఎన్‌ఎస్‌యూఐ నేతలను కలిశారు. పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రాహుల్. కాగా ఓయూలో రాహుల్ సమావేశానికి పర్మిషన్ కోసం వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన కార్యకర్తలపై పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టి, జైలుకి పంపారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. తదుపరి గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కీలక సమావేశంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా తెలంగాణాలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడిగి తెలుసుకున్నారు. మండల కో-ఆర్డినేటర్లతో ఫోటో సెషన్ నిర్వహించిన అనంతరం సుమారు 3 గంటల సమయంలో గాంధీ భవన్ నుంచి రోడ్ మార్గం ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని, సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ