తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సాయంత్రం నాటికి కొన్నిచోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ, వర్షం సమయంలో అనవసరంగా బయటకు రావద్దని సూచించింది.
ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఇక గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటలో 5.6 సెం.మీ. వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 5.6 సెం.మీ, కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఎలుపుగొండలో 5.3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తాజా వెదర్ రిపోర్ట్ ప్రకారం.. ఏపీలోని రాయలసీమపై అల్పపీడనం కాస్త బలహీనపడిందన్నారు. అయితే ప్రస్తుతం అక్కడే స్థిరంగా కొనసాగుతుందని చెప్పారు. సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ అది మేఘాలతో ఆవరించి ఉందన్నారు. అక్టోబర్ 22న మరో అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. అది ఒడిశా వైపు కదులుతూ.. బలపడే అవకాశం ఉందన్నారు. దీని కారణంగా ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.