ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. గతకొద్దిరోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈనెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆయనకు పరీక్షలు చేసి స్టెంట్ వేశారు. ఆ తర్వాత ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఈక్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున 3:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. రామోజీరావు మరణవార్త తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 16 నవంబర్ 1936లో రామోజీరావు జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 87 ఏళ్లు. 1974 ఆగష్టు 10న విశాఖలో ఈనాడు దినపత్రికను ఆయన ప్రారంభించారు. ఈనాడు సంస్థతో పాటు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫఉడ్స్ వంటివ్యాపారాలు నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. భారత ప్రభుత్వం 2016లో రామోజీరావును దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
రామోజీరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.