దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించారని హైడ్రా జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ శాస్త్రీయంగా జరగలేదని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా… బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వారంలోపు చెరువుల పరిరక్షణ కమిటీ ముందు హాజరై అభ్యంతరాలను చెప్పాలని బాధితులకు కూడా సూచించింది. ఆరు వారాల్లోగా ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించాలని హైకోర్టు ఆదేశించింది.
రాయదుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు చుట్టూ పెద్ద ఎత్తున భవనాలు నిర్మాతం అయ్యాయి. 2014లో చెరువు వంద ఎకరాలు ఉందని నోటిఫై చేశారు. ఇప్పుడు లెక్క వేస్తే 84 ఎకరాలు మాత్రమే ఉందని గుర్తించారు. అంటే పదహారు ఎకరాలు కబ్జాకు గురైనట్లుగా గుర్తించి.. ఫుల్ ట్యాంక్ లెవల్ వరకూ హద్దులు చూసి ఆ లోపుల ఇళ్లు ఉన్న వారందరికీ హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి కూడా ఉన్నారు. ఆయన మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి ఇల్లు ఉంది. అది ఎఫ్‌టీఎల్ పరిధిలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే కూలగొట్టలేదు.
దుర్గం చెరువు చుట్టూ కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వంటి కాలనీలు ఉన్నాయి. వీటన్నింటికీ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేసిన వారిలో అత్యధికులు ప్రముఖులే. ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. నెలలోగా ఈ అక్రమ కట్టడాలు కూల్చేయాలని నోటీసులు ఇవ్వడంతో.. వారు హైకోర్టుకు వెళ్లారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట వాదనలు వినిపించాలని సూచించింది. ప్రస్తుతానికి.. తిరుపతి రెడ్డితో పాటు దుర్గం చెరువు పరిసరాల్లో ప్రాంతాల్లో ఉన్న వారికి కాస్త ఊరట లభించిందని అనుకోవచ్చు.