తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు శుక్రవారం) మాజీ క్రికెటర్, సీనియర్ నాయకులు మహమ్మద్ అజారుద్దీన్‌ని మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పదవులను ఆశించిన ఇద్దరు సీనియర్ నాయకులను బుజ్జగిస్తూ, వారికి ముఖ్యమైన పదవులను కేటాయించింది రేవంత్ సర్కార్.
సుదర్శన్ రెడ్డికి కీలక బాధ్యతలు:
సుదర్శన్ రెడ్డికి సలహాదారు పదవి: మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతను సుదర్శన్ రెడ్డికి అప్పగించడం జరిగింది.
ప్రేమ్‌సాగర్ రావుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి:
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కేటాయించారు. ఆయన కూడా కేబినెట్ హోదాతో కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ఇక మంత్రి పదవులు ఆశించిన ఈ సీనియర్ నాయకులకు కీలక పదవులను కేటాయించడం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణలో తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది.
త్వరలో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ:
నేడు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ కేబినెట్ బలం 16కు చేరింది. అయితే, రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించడానికి ఇంకా రెండు మంత్రి బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత ఆధారంగా పూర్తి స్థాయి మంత్రివర్గ కూర్పును త్వరలో చేపట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.
 
			 
		





































