తెలంగాణలో కొద్దిరోజులుగా మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రిపదవులు ఎవరిని వరించనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మరి వారిలో ఎవరిని హైకమాండ్ ఎంపిక చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి పలువురు సీనియర్లు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి సహా మరో ముగ్గురు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో తమ పార్ట నేతలను కాంగ్రెస్ తమవైపు లాక్కోవడంపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. పదవులు ఆశచూపి తమ ఎమ్మెల్యేలను వారి పార్టీలో కాంగ్రెస్ చేర్చుకుంటోందని పలువురు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఎంతో మంది సీనియర్లను పక్కకు పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ పదవి ఇచ్చానని.. కానీ ఇప్పుడు తనకు ద్రోహం చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవికోసం ఆశపడి పోచారం పార్టీమారారని అన్నారట.
అయితే మంత్రివర్గ విస్తరణపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలవేళ కాంగ్రెస్ ఇచ్చిన బీఫాంపై పోటీ చేసి గెలుపొందిన వారికి మాత్రమే మంత్రి పదవి ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో రెండో మాటకు అవకాశం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేసిన వారు ఉన్నారని.. వారికే మంత్రి పదవులు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలో చేరిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పీసీసీ చీఫ్ పదవిని కొందరు నేతలు ఆశిస్తున్నారని.. కానీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ