తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవిపై గతంలో ఎప్పుడూ లేనంతగా రగడ జరుగుతుంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడి కోసం ఈటల రాజేందర్, డీకే అరుణ, రాంచందర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్టానినికే కొంతమంది నేతలు కొన్ని కండీషన్స్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మరి కొందరు నేతలు మాత్రం కమలం దళపతి ఎంపికలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీకి కొత్త దళపతి ఎంపికపై అధిష్టానం ఓ వైపు కసరత్తు స్పీడప్ చేసే పనిలో ఉండగా.. ఎలాంటివారిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న విషయంపై ఢిల్లీ పెద్దలకే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచనలు చేశారు. అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర కమిటీకి అప్పగించవద్దని ..అలా చేస్తే అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్‌గానే ఉంటారని చెప్పుకొచ్చారు. అందుకే కేంద్ర కమిటీనే ప్రెసిడెంట్‌గా ఎంపిక చేయాలంటూ సూచించారు. . కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దని.. ధర్మం కోసం పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలంటూ కామెంట్లు కూడా చేశారు. కాంట్రవర్శికి కేరాప్ అడ్రస్ అయిన రాజాసింగ్ చేసిన కామెంట్లతో ఇప్పుడు మరోసారి బీజేపీ రాజకీయాల్లో చిన్నపాటి రగడ నెలకొంది.
మరోవైపు బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని.. కానీ కొత్త దళపతి రేసులో తాను లేనని.. ప్రెసిడెంట్ పదవి వస్తుందని తాను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోనని క్లారిటీ ఇచ్చారు.రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో.. కార్యకర్తలు ఎలా ఉండాలో బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఇటు తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక విషయంలో హై కమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.
ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఇప్పటి వరకూ ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, రాంచందర్ రావు పేర్లు వినిపించాయి. అయితే తాను రేసులో లేనని బండి సంజయ్ ప్రకటించడంతో మల్కాజిగిరి నేతల్లో ఒకరికి లైన్ క్లియర్ అయింది. అయితే హైకమాండ్ లెక్కలు వేరే ఉంటాయంటున్న వాదన కూడా వినిపిస్తోంది. గ్రూపులకు తావు లేకుండా అందరినీ కలుపుకొని పోయే నాయకుడి కోసం అధిష్టానం వడపోస్తుందని దీనికోసం అవసరం అయితే రేసులో లేని నేతలకు కూడా అవకాశం ఇచ్చే ఆలోచనల్లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమయినా ఉగాది కల్లా కొత్త సారథి ఎవరో క్లారిటీ వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.