కొద్దిరోజులుగా తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్‌ను లూటీ చేయడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు వల వేసి తమవైపు లాక్కుంటోంది. ఇప్పటికే ఆరుగరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి వెళ్లడం ఖాయమని.. బీఆర్ఎస్ లూటీ అవ్వడం పక్కా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా త్వరలోనే సొంత గూటికి వెళ్తారని.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.
పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతుండడంతో.. సబితా ఇంద్రా రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లారని.. ఆ పార్టీ కండువా కప్పుకోవడం తరువాయి అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే తాజాగా తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితిలోనూ బీఆర్ఎస్‌ను విడిచిపెట్టేది లేదని.. కాంగ్రెస్ కండువా కప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తనకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని.. తనకు పార్టీ మారాల్సి అవసరం కూడా లేదని వెల్లడించారు. అటువంటి ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు సబితా ఇంద్రా రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని క్లారిటీ చ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలోవాస్తవం లేదని.. అదంతా పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. దయచేసి తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.
ఇకపోతే 2000 సంవత్సరంలో తన భర్త, మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మరణించడంతో సబితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టారు. తన భర్త మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి చేవెళ్ల నుంచి సబితకు అవకాశం ఇచ్చారు. రెండోసారి ఆమె గెలుపొంది వైఎస్సార్ కేబినెట్‌లో హోం శాఖ మంత్రిగా పని చేశారు. అయితే 2009కి వచ్చే సరికి చేవెళ్లను ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మార్చేశారు. దీంతో సబితా మహేశ్వరంకు వెళ్లాల్సి వచ్చింది.
మూడోసారి చేవెళ్ల నుంచి సబిత పోటీ చేసి గెలుపొందారు. ఈసారి కూడా వైఎస్సార్ తన కేబినెటలో సబితకు స్థానం కల్పించారు. 2014 ఎన్నికలకు సబితా దూరంగా ఉండి.. లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు కార్తిక్ రెడ్డిని బరిలోకి దింపారు. చేవెళ్ల నుంచి కార్తిక్ పోటీ చేసి ఓడిపోయారు. 2018లో మరోసారి కాంగ్రెస్ తరుపున మహేశ్వరం నుంచి పోటీ చేసి సబిత గెలుపొందారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో మరోసారి మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో సబిత పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ ప్రచారాన్ని సబితా ఇంద్రా రెడ్డి ఖండించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ