జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసుల చర్యలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం, ఆయనను సాధారణ నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేయడం ఏంత మాత్రం తగదు.
వాస్తవానికి డిసెంబర్ 4వ తేదీ రాత్రి పది గంటలకు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లారు. అయితే అల్లు అర్జున్ ని చూడటానికి ఒక్కసారిగా అభిమానులు ఎగబడటంతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఎల్‌బినగర్‌కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ దుర్ఘటన జరగటం నిజంగా బాధాకరం.
అయితే…ఈ ఘటన గురించి తెలిశాక అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యాడు. ఆ కుటుంబానికి పరిహారం కింద పాతిక లక్షలు ప్రకటించాడు. ఎప్పుడూ ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చాడు. ఆ సమయంలో ప్రత్యేకంగా ఓ వీడియో కూడా విడుదల చేశాడు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయారని తెలిసి చాలా బాధ అనిపించిందని చెప్పాడు అల్లు అర్జున్. సుకుమార్‌తో పాటు సినిమా టీమ్ అంతా దిగ్భ్రాంతికి లోనయ్యిందని వెల్లడించారు.
అల్లు అర్జున్ సాధారణంగా తన సినిమాను అభిమానులతోనే ఎప్పుడు చూస్తుంటారు. గతంలోను కూడా చాలా సార్లు థియేటర్ కి వెళ్లి సినిమా చూశారు. అందులో అల్లు అర్జున్ మనం తప్పుపట్టడానికి ఏమి లేదు. ఇలాంటి పరిస్థితులు సెలబ్రిటీలకు సాధారణం. అయితే అలాంటి సమయంలో ఆ థియోటర్ యాజమాన్యం ఖచ్చితంగా అభిమానుల రాకపై ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. థియోటర్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో చేసుండాల్సింది. అల్లు అర్జున్ లాంటి సెలబ్రెటీ వచ్చినప్పుడు పోలీసులు కావాల్సిన భద్రత ఏర్పాటు చేసుండాల్సింది. దీనికి అల్లు అర్జున్ కి ఏం సంబంధం..?
సాధారణంగా సినిమా టికెట్ల కోసం తోపులాటలో ఇప్పటి వరకు ఎంతో మంది మృతి చెందిన సందర్భాలు కూడా జరిగాయి. వాటికి ఆ సినిమాలో హీరోని బ్లేమ్ చేయడం సమంజసమేనా. ఖచ్చితంగా ఆ థియోటర్ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాల్సిందే. అంతే కాని అల్లు అర్జున్ కి ఇందులో ఎలాంటి పాత్ర లేదు.
ఇలాంటి సంఘటనలు గతంలో చాలా మంది సెలబ్రిటీలకు ఎదురయ్యాయి. తారలు లేదా పబ్లిక్ ఫిగర్లు తాము చేయని పనులకు బాధ్యత వహించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు, తమ పరిసరాల్లో ఉన్న వ్యక్తుల చర్యలు లేదా వారు తెలియక చేసిన తప్పులు వారి పేరుతో ముడిపడి ఉండటంతో వారి పేరే ముందుకు వస్తోంది. అయితే ఇలా ఇంతవరకు ఏ సెలబ్రిటీని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. గతంతో 2012 లో షారుక్ ఖాన్ విషయంలో ఇలానే జరిగింది. కాని అప్పుడు షారుక్ ను అరెస్ట్ చేయలేదు. కాని ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనే ఎందుకు ఇలా జరిగింది అనే అంశం చర్చనీయాంశమవుతోంది.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీల పేరును ఈ విధమైన అంశాలకు ముడిపెట్టడం అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం. మునుముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం దృష్టి పెట్టకుండా ఇలా అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ ను అరెస్ట్ చేయడమే సమస్యకు పరిష్కారం అన్నట్లు చిత్రీకరించడం ఎంత మాత్రం హేయమైన చర్య అనిపించుకోదు.
‘పుష్ప: ది రైజ్’ అఖండ విజయం తర్వాత ‘పుష్ప: ది రూల్’పై అభిమానులు, ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అలాంటి సమయంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం అభిమానులతో పాటు సినీప్రీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనకు అల్లు అర్జున్‌ను లక్ష్యంగా చేయడం అన్యాయమని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. మృతి చెందిన రేవతి భర్త కూడా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పై స్పందించారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని తెలియడంతో కేసును వాపస్ తీసుకుంటామని ప్రకటించినట్లు తెలుస్తోంది. బాధితులు కూడా అసలైన కారకులపై కేసు పెట్టారు కాని అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని అనుకోలేదని వారి ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
అసలు ఏం తప్పు చేయని అల్లు అర్జున్‌ను నేరస్తుడిగా చూడటం ఆయన వ్యక్తిత్వానికి, గౌరవానికి పెద్ద మాయని మచ్చలా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమైన అల్లు అర్జున్‌ను గౌరవంగా చూడాలి, అతనిపై ఉన్న కేసులను పునః పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది