తెలంగాణలో ఇప్పుడు ఒక పట్టభద్రులు, రెండు టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరుగనుంది. మార్చి 3వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. అయితే ఇదే సమయంలో ఎన్నికల సంఘం మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
ఏపీ, తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కాబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీనిపై షెడ్యూల్ కూడా ప్రకటించింది. దీనిపై మార్చి 3న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. మార్చి 20న ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 10 వరకు నామినేషన్ల స్వీకరణ.. 11న స్క్రూటినీ, 13వ తేదీ వరకు ఉప సంహరణకు అవకాశం ఉంటుంది.
తెలంగాణలో ఐదు, ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29వ తేదీన ఖాళీ కాబోతున్నాయి. ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి,పి.అశోక్‌బాబు, డి.రామారావు,తిరుమలనాయుడు పదవీకాలం ముగుస్తుంది. అలాగే తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, యగ్గె మల్లేశం, మీరా రియాజుల్ హుస్సేన్ పదవీకాలం కూడా పూర్తవుతుంది.
తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం చూస్తే 5 ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ పార్టీకి, ఒకటి బీఆర్‌ఎస్ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఎంఐఎం స్థానం ఖాళీ అవుతుండడంతో ప్రస్తుతం కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు ఒక స్థానం కేటాయిస్తే, కాంగ్రెస్‌కు3 స్థానాలు దక్కుతాయి. ఇక ఏపీలో అధికార టీడీపీ,జనసేన,బీజేపీ కూటమికే ఐదు స్థానాలు దక్కనున్నాయి. ఈసారి జనసేన నేత నాగబాబుకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన టీడీపీ… ఎమ్మెల్సీగా చేసి కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తామని పేర్కొంది. మిగిలిన నాలుగు స్థానాల్లో బీజేపీకి ఇస్తుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.