తెలంగాణలో భానుడు మండిపడుతున్నాడు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రజలు దహనమయ్యే ఎండను ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీదకు వస్తేనే శరీరం మండిపోతున్నట్లుగా అనిపిస్తోంది. ఎండ ప్రభావంతో రోడ్లు, గోడలు తాకలేని స్థాయిలో వేడెక్కిపోతున్నాయి. గతేడాది కంటే ఈసారి మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాడ్చే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భానుడి ప్రతాపం మరింత పెరిగే సూచనలున్నాయని, మరో రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కుమురంభీం-ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ-గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఇతర సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. వడగాలులు వీచే అవకాశం ఉందని, వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే, ఏప్రిల్ 2, 3 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్ష సూచన ఉందని పేర్కొంది.