కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం, జూలై 28 తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1942 జనవరి 16న నల్గొండ జిల్లా నెర్మాట గ్రామంలో జన్మించిన జైపాల్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న దశ నుండే రాజకీయాల్లో పాల్గొని, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తరువాత రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. కీలకమైన తెలంగాణ ఉద్యమసమయంలోనూ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి, పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేంతవరకు కీలక పాత్ర పోషించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జైపాల్ రెడ్డి మృతి పట్ల విచారం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర మంత్రులు, పలువురు రాజకీయనాయకులు జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
జైపాల్ రెడ్డి అంత్యక్రియలను, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. జైపాల్ రెడ్డి ఇంటినుంచి అంతిమ యాత్ర ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ కు పార్థివదేహాన్ని తీసుకొచ్చి అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం, జూలై 29 మధ్యాహ్నం 2 గంటల నుండి నెక్లస్ రోడ్ లో గల పీవీ ఘాట్ వద్ద జైపాల్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.
[subscribe]
[youtube_video videoid=i4IFVf3Z_Ns]