మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు

Sensational Facts In The Meerpet Madhavi Murder Case

హైదరాబాద్‌లోని మీర్‌పేట్ మాధవి మర్డర్‌ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గురువారం ..మాధవి పిల్లల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేయగా.. సంక్రాంతికి ఊరెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో భరించలేని వాసన వచ్చినట్లు కూతురు చెప్పింది. అమ్మ ఎక్కడ అని అడిగితే తన తండ్రి గురుమూర్తి మౌనంగా ఉండిపోయినట్లు చెప్పింది.

అటు గురుమూర్తి ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్ కొన్ని ఆధారాలను సేకరించింది. గురుమూర్తి తన భార్య వెంకట మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లు గుర్తించింది. మాధవి హెయిర్‌ శాంపిల్స్‌ కూడా కాలిన స్థితిలో దొరికాయి. ఆ శాంపిల్స్‌ను పిల్లల డీఎన్‌ఏతో సరిపోల్చడానికి పరీక్షకు పంపారు. అలాగే భార్య హత్యకు గురుమూర్తి ఉపయోగించిన కొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో రక్తపు మరకలను గుర్తించారు. గురువారం రాత్రి గురుమూర్తిని మరోసారి చెరువు దగ్గరకి తీసుకెళ్లారు.

నిందితుడి పొంతనలేని సమాధానాలు పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. ఇంటరాగేషన్‌లో గురుమూర్తి పూటకో వర్షన్‌ తో చెబుతున్న సమాధానాలు విని పోలీసులు విసిగెత్తిపోతున్నారు. అయితే గురుమూర్తి కొన్నాళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమె గురుమూర్తికి సమీప బంధువు అని ఈ విషయం భార్యకు తెలియడంతో గొడవలు జరిగాయని భావిస్తున్నారు.

వేరే మహిళతో గురుమూర్తి ఉన్న కొన్ని ఫొటోలను మాధవి చూడటంతో 15న ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో భార్యను అడ్డుతొలగించాలని స్కెచ్ వేసిన గురుమూర్తి.. సంక్రాంతి సెలవులకు తన ఇద్దరు పిల్లల్ని సోదరి ఇంటికి పంపించాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయంపూట సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చారు. భార్యను హతమార్చాలనే పన్నాగంతో ఉన్న ఆ మానవ మ‌ృగం.. నరహంతకులు సైతం విస్తుపోయాలా టోటల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశాడు.

ముందుగా మాధవిని గోడకు కొట్టి కిరాతకంగా చంపేసి..ఆమె చనిపోయిందని నిర్దారించుకున్నాక ఓటీటీలో చూసిన ఒక వెబ్‌సిరీస్‌లో ఉన్నట్లుగానే… ఆమె బాడీని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు. తర్వాత వాటిని బకెట్‌లో ఉన్న నీళ్లలో వేసి హీటర్‌తో ఉడకబెట్టాడు. ముక్కలు మొత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి వాటిని కాల్చిన తర్వాత మరో బకెట్‌లో వేసి రోకలితో దంచి పొడిగా చేశాడు. తర్వాత ఆ పొడిని సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు.

హత్య తర్వాత రెండ్రోజులపాటు నిద్రలేకుండా రాత్రుళ్లు ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. మాధవి బాడీని మాయం చేశాక గదిని శుభ్రం చేశాడు. కాగా బుధ, గురువారాల్లో నిందితుడి ఇంటిలో క్లూస్‌టీం, ఫోరెన్సిక్‌ బృందాలు నీళ్ల బకెట్, వాటర్‌ హీటర్‌తో పాటు ,కుక్కర్, చెక్క దిమ్మె ఇతర కీలక ఆనవాళ్లను సేకరించాయి. వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.