ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌గా కాళేశ్వరం గురించి గత కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది.అయితే సుమారు రూ.లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభించిన మూడేళ్లకే కుంగిపోవడంతో విపక్షాలు మండిపడ్డాయి. అంతేకాదు గత ప్రభుత్వం హయాంలో కీలకమైన లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద బుంగలు పడటం వంటి ఘటనలు ఇంకాస్త ఆజ్యం పోసాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టింది. ఇది రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించి దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుందని గులాబీ బాస్ భావించారు. అయితే, 2023 ఎన్నికలకు ముందే మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు బయటపడటంతో ఈ ప్రాజెక్ట్ రాజకీయ ప్రయోజనాలు చేకూరడం మాట పక్కన పెడితే..ఇది బీఆర్‌ఎస్‌కు భారంగా మారిపోయింది. గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిలో ప్రాజెక్టులో లోపాలు కూడా కారణంగా మారాయి.
ఇప్పుడు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన నివేదిక..బీఆర్ఎస్‌కు మరో షాక్ ఇచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అసలు పనికిరావని, వీటిని ఉపయోగిస్తే ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని NDSA తేల్చి చెప్పేసింది. 14 నెలల సుదీర్ఘ అధ్యయనంతో పాటు పలు పరీక్షల తర్వాత NDSA సమర్పించిన నివేదిక సమర్పించింది. ఈ నివేదిక చెప్పిన దాని ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మూడు బ్యారేజీల డిజైన్ తో పాటు నిర్మాణంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీకెంట్ పైల్స్ కూలిపోవడమే కాదు.. బ్యారేజీల ఎగువ, దిగువ భాగాల్లో రంధ్రాలు కూడా ఏర్పడినట్లు NDSA గుర్తించింది. ఈ బ్యారేజీలను యథావిధిగా ఉపయోగించవద్దని.. పూర్తిగా రీడిజైన్ చేసి నిర్మించాలని NDSA తేల్చి చెప్పింది ఈ లోపాల వల్ల బ్యారేజీలు శాశ్వత నష్టానికి గురయ్యే అవకాశముందని హెచ్చరించింది.
అంతేకాకుండా .. బ్యారేజీల నిర్మాణానికి ముందు అవసరమైన భూసార పరీక్షలను నిర్వహించలేదని NDSA నివేదికలో మరో కీలక అంశం కూడా బయటపడింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సిఫారసు చేసిన స్థలాలకు బదులు, ఇతర ప్రాంతాలకు మార్చారని..ఇది నిర్మాణ స్థిరత్వాన్ని దెబ్బతీసిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే జాతీయ ఆనకట్టల భద్రత చట్టం–2021 ప్రకారం, వర్షాకాలానికి ముందు బ్యారేజీల భద్రతా తనిఖీలు చేయాల్సిన నిబంధనను అప్పటి అధికారులు పాటించలేదని నివేదిక వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ఈ నివేదిక కీలక ఆధారంగా మారనుంది. NDSA నివేదిక బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేసీఆర్‌లను దీనిపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. రాజకీయంగా, ఈ నివేదిక బీఆర్‌ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారిపోయి.. అధికార పార్టీకి రాజకీయ ఆయుధంగా తయారయింది.