హైదరాబాదీలకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. 20 కిలోవాట్ల లోడ్ దాటితే నియంత్రిక అంటే డీటీఆర్ ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లో సర్కిళ్ల వారీగా విద్యుత్తు నియంత్రికల లోడ్‌పై తాజాగా డిస్కం చేపట్టిన సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెల్లడవడంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అపార్ట్‌మెంట్లలో 20 కిలోవాట్ కంటే ఎక్కువగా లోడ్ ఉంటే వాళ్లు ఇకపై ప్రత్యేకంగా డీటీఆర్ ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని సర్కిళ్లలో పెద్ద సంఖ్యలో చిన్న అపార్ట్‌మెంట్లు పబ్లిక్ డీటీఆర్‌ల నుంచి కనెక్షన్లు పొందినట్లు సర్వేలో తేలింది. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది, అధికారులు బిల్డర్లతో కలిసి..ఈ నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన కనెన్షన్ల బాగోతం వెలుగులోకి వస్తోంది. ఇప్పటి వరకు 15వందల85 అపార్ట్‌మెంట్లకు రోడ్డుపైన ఉండే పబ్లిక్ డీటీఆర్ నుంచే.. అధికారలు విద్యుత్తు కనెన్షన్లు ఇచ్చినట్లు గుర్తించారు. ఇంకా సర్వే కనుక మొత్తం పూర్తయితే ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఇంజినీర్లు అంటున్నారు.
ఒక్క మణికొండలోనే కుప్పలు కుప్పలుగా ఇలాంటి కనెక్షన్స్ ఉన్నట్లు సర్వేలో తేలింది. మణికొండ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారులు చెబుతున్నారు.వీరంతా అప్పట్లో అక్రమంగా విద్యుత్తు కనెక్షన్లను పొందినట్లు గుర్తించారు. పబ్లిక్ డీటీఆర్‌ల నుంచి అపార్ట్‌మెంట్లకు 200కు పైగా కనెన్షన్లు పొందినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. అంతెందుకు సాక్షాత్తూ సైబర్‌సిటీ సర్కిల్‌లో కూడా ఈ తరహా కనెన్షన్లు వెలుగుచూడటం చేసి అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు
దీంతో మొత్తం సిటీలో ఇలా కనెక్షన్ పొందిన ఆయా అపార్ట్‌మెంట్లకు త్వరలోనే నోటీసులు పంపనున్నారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్ డీటీఆర్ నుంచి విద్యుత్తు కనెక్షన్లు పొందిన చిన్న అపార్ట్‌మెంట్లకు, వాణిజ్య భవనాలకు అధికారులు అతి త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌస్‌లు, వాణిజ్య భవనాలకు సంబంధించి 20 కిలోవాట్లకు మించిన లోడ్ ఉంటే వాటికి ప్రత్యేకంగా డీటీఆర్ ఏర్పాటు తప్పనిసరి అని నోటీసులలో తెలపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.