యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలోనే.. యాదాద్రి టెంపుల్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. యాదాద్రి ఆలయ నిర్వాహణ, సేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ది పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, వైటిడిఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్ట్ తనకు అందించాలని అధికారులకు సూచించారు.
స్వామివారి ప్రధాన ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులను వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా ఆలయ పనులు, వివిధ కార్యక్రమాలు జరపాలని ఆలయ అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. ఇవే కాకుండా.. అరుణాచలం తరహాలో గిరిప్రదక్షిణలను కూడా ప్రారంభించారు. ప్రసాదం విషయంలోనూ, స్వామి సేవల విషయంలో, ఆలయ నిర్వహాణ ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని.. యాదాద్రిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే.. టీటీడీ తరహాలో యాదాద్రి టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఏకో, టెంపుల్ టూరిజం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటితోపాటు హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ బయట మారో జూ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంబించాలన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఇతర ఉన్నతాధికారులతో పాటు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కాగా నిన్న వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్దికి 50 కోట్లు కేటాయించారు. సీఎంను కలిసిన బృందం రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలపై చర్చించింది, ప్రతిపాదిత నమూనా మరియు ప్రణాళికలకు శృంగేరి పీఠం నుండి ఆమోదం అవసరమని అభిప్రాయానికి వచ్చారు. తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైన అనుమతులు తీసుకుని సంబంధిత అభివృద్ధి పనులను జాప్యం లేకుండా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.