SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అక్కడ రెస్క్యూ సిబ్బందికి ఏడు సమస్యలు ఎదురవుతున్నాయి. టన్నెల్‌లో ప్రమాద స్థలానికి వెళ్తున్నపుడు సీపేజ్ ఉబికి వస్తోంది. భూగర్భ జలం లీకేజీ వల్ల మరికొంత ఇబ్బందులు తప్పడంలేదు.దీంతో నిరంతరం భారీ మోటార్లు ఉపయోగించి డీ వాటరింగ్ చేస్తున్నారు. సీపేజ్ వల్ల నీటి మట్టం పెరుగుతూ ఉండటం వల్ల లోకో మోటివ్‌గాని.. మరే పరికరాన్ని కాని ప్రమాదస్థలానికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోవడంతో.. కార్మికులను వెలికి తీసే ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. డీ సిల్టింగ్ ప్రక్రియ ప్రారంభమైతే బురదను బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి అక్కడ కనిపించడం లేదు.
ప్రమాదస్ధలం దగ్గర నుంచి రెండున్నర కి.మీ. వరకు ఓవైపు సీపేజ్ నీరు వస్తుంటే.. ఇంకోవైపు నీటితోపాటు 10 అడుగుల వరకూ మట్టి పేరుకుపోవడం చాలా పెద్ద సమస్య అయింది. దీనికి తోడు ప్రమాద స్థలం దగ్గర గాలి, వెలుతురు అస్సలు లేవు. ఎయిర్ బ్లోయర్ ధ్వంసం కావడంతో ఎక్కువ స్థాయిలో గాలిని లోపలికి పంపించే పరిస్థితి కనిపించడంలేదు. చుట్టూ చిమ్మ చీకట్ల వల్ల ఎక్కడ ఏముందో కనిపించక రెస్క్యూ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ప్రమాదం జరిగిన దగ్గర మట్టిలో బోరింగ్ మెషిన్ 20 మీటర్ల వరకూ కూరుకుపోయింది . ఇదే రెస్క్యూ ఆపరేషన్‌లో బిగ్గెస్ట్ చాలెంజ్‌గా ఉంది. నీరు పెరగడంతో బోరింగ్‌మె షిన్ దగ్గర బురద కూడా పెరిగిపోయి మరింత కష్టంగా మారుతోంది.
ఇక బురద, నీరు వల్ల టీబీఎం దగ్గర ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. రెస్క్యూ సిబ్బంది అతికష్టం మీద టీబీఎం దగ్గరకు చేరుకున్నా.. అక్కడ అడుగు పెట్టాలంటేనే కఠిన పరిస్థితులున్నాయి. మట్టిలో కూరుకుపోతుండడం.. నీళ్లు భారీగా చేరడం వల్ల సిబ్బంది పనులకు ఆటంకం కలుగుతోంది. టన్నెల్‌లో 12వ కి.మీ నుంచి 13వ కి.మీ. వరకు కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం.. మట్టి, నీరు, బురద, చెల్లాచెదురుగా పడ్డ సామాగ్రితో ఎలా పనులు సాగించాలో తెలియని పరిస్థితి కనిపిస్తోంది.
ఎస్ఎల్‌బీసీ ప్రమాద సంఘటన స్థలంలో జరిగే సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. మరోవైపు దోమలపెంట సమీపంలో సంఘటనా స్థలం లోనే నిన్నటి నుంచి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారుల బృందం సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.