ప్రముఖ దివంగత సినీ నేపథ్య గాయకుడు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) విగ్రహాన్ని ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఆవిష్కరించారు. బాలు సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ.. ఆమె భర్త, నటుడు శుభలేఖ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఏర్పాటు జరిగింది.
కాగా బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారి కారణంగా 2020 సెప్టెంబర్ 25న 74 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గానగంధర్వుడి స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక, ఈ వేడుక కళారంగానికి, ముఖ్యంగా సంగీత ప్రియులకు అరుదైన గౌరవంగా నిలిచింది.
ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ
- హాజరైన ప్రముఖులు: ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సహా వివిధ వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
-
విగ్రహ వివరాలు: రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహం 7.2 అడుగుల ఎత్తు కలిగి ఉంది. దీనిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో తయారు చేయించారు.
సంగీత విభావరి కార్యక్రమం
విగ్రహావిష్కరణను పురస్కరించుకుని రవీంద్రభారతిలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఎంతో ఇష్టమైన 20 పాటలతో కూడిన సంగీత విభావరిని నిర్వహించారు. సుమారు 50 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాలు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
భావితరాలకు బాలు ఆదర్శం: వెంకయ్య నాయుడు
విగ్రహావిష్కరణ అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ.. “ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. భావితరాల కోసమే ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బాలు ఎందరికో ఆదర్శంగా నిలిచారని, నెల్లూరులోని తన ఇంటిని సైతం వేద పాఠశాలకు ఇచ్చేశారని గుర్తు చేసుకున్నారు. బాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాట రూపంలో చిరస్థాయిగా ప్రతిఒక్కరి మనస్సులో నిలిచిపోతారు” అని తెలిపారు.
విగ్రహావిష్కరణపై తెలంగాణ వాదుల నిరసన
అయితే, ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా ఒకవైపు ఘన నివాళి కార్యక్రమాలు జరుగుతుండగా, మరోవైపు తెలంగాణ వాదుల నిరసనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఉద్యమకారుడు పృథ్వీరాజ్ వంటి పలువురు తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.
తెలంగాణ కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సాంస్కృతిక వేదిక అయిన రవీంద్రభారతిలో బాలు విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో విగ్రహావిష్కరణ సమయంలో నిరసన తెలిపేందుకు సిద్ధమైన తెలంగాణ వాదులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రవీంద్రభారతి, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.



































