ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కాగా ముకుల్ రోహత్గి వాదిస్తూ కవిత ఎవరినీ బెదిరించలేదని ఈడీ, సీబీఐ కేసులో ఆమె గత 5 నెలలుగా (153 రోజులుగా) జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారని తెలిపారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని తెలిపారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికీ వెళ్లరని చెప్పారు. రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న ముకుల్ రోహత్గి, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదన్నారు. ఇదే కేసులో మనీశ్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని, సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకూ వర్తిస్తాయని ధర్మాసనానికి వివరించారు.
కాగా విచారణ సందర్భంగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో కవిత ప్రమేయం ఉందని రుజువు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరియు సిబిఐ తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించాలని జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు కెవి విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. ఈడీ నుంచి నోటీసులు రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని.. కేవలం 10 రోజల డేటా మాత్రమే రికవరీ చేశారని గుర్తుచేశారు ఎస్వీ రాజు. ఫోన్లను అన్నింటిని ఫార్మాట్ చేసి ఇంట్లో పని చేసే వారికి ఇచ్చారని ఆరోపించారు. అందుకు రోహల్దీ సమాధానమిస్తూ.. ప్రజలు ఎవరైనా ఫోన్లు, కార్లు మారుస్తూ ఉండటం సహజమని అన్నారు. అందుకు ధర్మాసనం ప్రతిరోజూ ఫోన్లు మార్చడం ఏంటని ప్రశ్నించింది. గంటన్నర కు పైగా సుప్రీం కోర్టులో వాడీ వేడి వాదనలు జరగగా ఈడీపై సుప్రీం కోర్ట్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయవాది తీర్పు వెల్లడించారు. తీర్పు లో అసంబద్ధ వ్యాఖ్యలు చేసినందుకు ఢిల్లీ హైకోర్టును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం కోర్టు కేసు మెరిట్స్ లోకి వెళ్ళడం లేదని పేర్కొంది.