తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర శాసనసభ ఆదివారం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు కఠిన నిబంధనలు విధిస్తూ, వారి సంరక్షణను బాధ్యతగా మార్చే ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం తల్లిదండ్రుల పోషణ – పర్యవేక్షణ బిల్లు-2026’కు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి భావోద్వేగంతో ప్రసంగిస్తూ, కన్నవారిని అనాథలుగా వదిలేసే సంస్కృతికి అడ్డుకట్ట వేయడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని, కానీ పిల్లలకు రెక్కలు వచ్చాక వారిని గాలికొదిలేయడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, ప్రైవేటు రంగంలో పనిచేసే వారు మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వంటి ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా ఉద్యోగి తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, బాధితుల ఫిర్యాదు మేరకు వారి నెలసరి జీతం నుండి గరిష్టంగా 15 శాతం లేదా రూ. 10,000 (ఏది తక్కువైతే అది) మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాకు మళ్లించే అధికారం ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం 2007లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం రూ. 10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేనందున, ప్రస్తుతానికి అదే పరిమితిని కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. తల్లిదండ్రుల సంరక్షణను సామాజిక బాధ్యతగా చూడాలని, వారిని చూడని వారిని సామాజికంగా బహిష్కరించాలని సీఎం పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన రేమండ్స్ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మరియు రామాయణంలోని శ్రావణకుమారుడి కథను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆత్మీయత, అనురాగాలకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావాల్సి రావడం బాధాకరమే అయినప్పటికీ, బాధ్యతలను విస్మరించేవారిలో భయం కలగడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
బిల్లు అమలు కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్‌ను నిర్ణీత అధికారిగా నియమించనున్నారు. తల్లిదండ్రులు చేసే ఫిర్యాదులను 60 రోజుల్లోపు పరిష్కరించాలని, ఒకవేళ అక్కడ న్యాయం జరగకపోతే సీనియర్ సిటిజన్స్ కమిషన్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని చట్టం నిర్దేశిస్తోంది. ఈ కమిషన్‌కు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు.






































