తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 9 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా అంటే వచ్చేనెల 9లోగా మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది.ఇటు డిసెంబర్ 7వ తేదీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తుండటంతో.. సమావేశాల నిర్వహణ గరంగరంగా జరిగే అవకాశాలున్నాయి.
గతేడాది కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9నే మొదలయ్యాయి. ఈ శీతాకాల సమావేశాల్లో తాము నూతన రెవెన్యూ చట్ట బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తర్వాత సచివాలయంలో తెలుగు తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని చెప్పారు. అదే రోజు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా తాము కొత్త చట్టాన్ని సిద్ధం చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి చెప్పారు. పాత చట్టంలో రైతులు ఇబ్బందులు పడుతుండటంతో.. కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకురావడానికి సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి డిసెంబరు ఏడుకి ఏడాది పూర్తవుతుంది. కాబట్టి ఈ లోపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నట్లు మంత్రి తెలిపారు.