తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి: సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Review on Palle Pragathi Development Programmes, Palle Pragathi, Palle Pragathi Development, Palle Pragathi Development Programmes, Palle Pragathi Development Programmes In Telangana, Palle Pragathi Second Phase, Telangana CM KCR, Telangana Palle Pragathi, Telangana Palle Pragathi Development Programmes

తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నదని, తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయి. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.

తెలంగాణలో 12,681 గ్రామాల్లో ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు:

‘‘తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్రంలో కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే సొంతంగా ట్రాక్టర్లు ఉండేవి. కానీ, నేడు 12,765 గ్రామ పంచాయతీలకు గాను 12,681 గ్రామాల్లో ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు సమకూరాయి. తెలంగాణ పంచాయతీలు ఎక్కడ నుండి ఎక్కడికి పోయాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. గతంలో అడవులు నరకడమే తప్ప పెంచడమనే మాటేలేదు. కానీ నేడు తెలంగాణ పల్లెల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. పచ్చదనం–పరిశుభ్రత విషయాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి గ్రామంలో నేడు నర్సరీ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా 12,755 నర్సరీలు ఉన్నాయి. గ్రామాల్లో మొక్కలు పెట్టి, వాటిని సంరక్షించే పనులు ఎంతో బాధ్యతగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో 91శాతం బతికాయి. ప్రతి గ్రామానికి ఓ ఉద్యానవనం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 19,470 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 19,027 చోట్ల స్థలాలను గుర్తించింది. 15,646 చోట్ల మొక్కలు కూడా నాటడం పూర్తయింది. మిగతా చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయి” సీఎం కేసీఆర్ అన్నారు.

రాష్ట్రంలో 2580 చోట్ల రైతువేదికల నిర్మాణం పూర్తి:

“రైతులు కూర్చొని చర్చించుకోవడానికి గతంలో ఓ వేదిక అంటూ లేదు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్లస్టర్ కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మిస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 2,601 చోట్ల రైతు వేదికలు నిర్మాణం ప్రారంభం కాగా, ఇప్పటికే 2580 చోట్ల నిర్మాణం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతున్నది. 91శాతం పనులు పూర్తయ్యాయి. 9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారీ జరుగుతున్నది. గతంలో స్మశానవాటికలు లేక సొంతస్థలం లేనివారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ దుస్థితిని నివారించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఖచ్చితంగా వైకుంఠధామం నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 12,742 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం జరుగుతున్నది. రైతులు తమ పంటలను ఎండబెట్టడానికి, నూర్పడానికి వీలుగా కల్లాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడత 93,875 చోట్ల కల్లాల నిర్మాణం ప్రారంభమైంది. గతంలో గ్రామ పంచాయతీలు కరంటు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ సంస్థలకు భారీ మొత్తంలో బకాయిలు పడాల్సిన పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా గ్రామ పంచాయతీలు కరంటు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నది. ప్రతినెలా రూ.308 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నది. దీనివల్ల గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధం లేకుండా కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నిరకాల సౌకర్యాలు, వెసులుబాట్లు, పచ్చదనం, పరిశుభ్రత, పారదర్శక పద్ధతులు కలిగిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. గ్రామాల్లో పెరిగిన పరిశుభ్రత వల్ల ఈసారి డెంగ్యూ వ్యాధి రాకపోవడాన్ని మనం గమనించవచ్చు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించినప్పుడు పల్లె ప్రగతి పనులను సమీక్షించాలి:

‘‘తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు నేల విడిచి సాము చేయకుండా గ్రామాలే కార్యవేదికగా గుర్తించాలి. గ్రామాలను గొప్పగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. అడిషనల్ కలెక్టర్, డీపీఓలు తరచూ గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించినప్పుడు ఖచ్చితంగా పల్లె ప్రగతి పనులను సమీక్షించాలి. ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలి. మండల పంచాయతీ అధికారులు నిత్యం అన్ని గ్రామాల్లో పర్యటించాలి. ప్రతి గ్రామంలో నర్సరీ ఉంది కాబట్టి ఎక్కడైనా మొక్కలు చనిపోతే వెంటనే రిప్లేస్ చేయాలి. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు అందించాలి’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సీఎం అభినందన:

పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషి చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని సీఎం అభినందించారు. మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను సీఎం ప్రశంసించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను పర్యవేక్షిస్తున్నారని, గ్రామ సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు ఎంతో శ్రమకోర్చి పనులు చేస్తున్నారని సీఎం అభినందించారు.

సంగారెడ్డి కలెక్టర్ కు సీఎం ప్రశంస:

అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరుశాతం నెరవేర్చిన సంగారెడ్డి కలెక్టర్ మంత్రిప్రగడ హన్మంతరావును సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలోని మొత్తం 647 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించి, వాటిని అందుబాటులోకి తెచ్చారని సీఎం అన్నారు. సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా వందకు వందశాతం వైకుంఠధామాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ కోరారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =