తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై ప్రధానంగా సమాలోచనలు జరగనున్నాయి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు రూపొందిస్తోంది.
ఇందిరమ్మ ఇండ్లు.. లబ్ధిదారులకు ఆర్థిక సాయం
స్వగృహం కల సాకారం చేసేలా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. కొత్తగా ఎంపికైన వారికి త్వరలోనే మంజూరుల జాబితా విడుదల కానుంది.
నిర్మాణానికి అవసరమైన పరిశీలన, మంజూరు, నిధుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ
రాష్ట్రంలోని అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పాత కార్డులను నవీకరించడం, కొత్త దరఖాస్తులను పరిశీలించడం చేపట్టనున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు స్వచ్ఛందంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుతో పేద ప్రజలకు నివాసం, నిత్యావసర సరుకుల భద్రత కల్పించనుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు ప్రత్యేక బిల్లులను క్యాబినెట్‌లో ఆమోదించనుందని సమాచారం. స్థానిక సంస్థాల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధిత బిల్లు విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లు ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత, వీటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేలా ప్రణాళిక సిద్ధమవుతోంది.
ఎస్సీ వర్గీకరణ బిల్లు
బీసీ రిజర్వేషన్లతో పాటు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు మరో బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం
ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను మార్చి రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు మార్చి 10న ప్రారంభమవుతుండటంతో, అసెంబ్లీ సమావేశాల తేదీలను నిర్ణయించనుంది.
రాహుల్ గాంధీ భేటీకి అవకాశం
బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్యాబినెట్ సమావేశం రాష్ట్ర భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.