రేపటి నుంచే సమగ్ర కుటుంబ సర్వే..

Telangana Caste Survey From Tomorrow

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే బుధవారం నవంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది, టీచర్లు ఈ కులగణన సర్వే చేపట్టనున్నారు. కుటుంబ యాజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను అందులో నమోదు చేయనున్నారు.

నవంబర్ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. సర్వే పూర్తయిన ఇంటికి ప్రభుత్వం స్టిక్కర్ వేసేలా ఏర్పాట్లను పూర్తి చేసింది. దీని ఆధారంగానే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్ ప్రాతిపదికన ముందుకు వెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కులగణన వివరాలను వినియోగిస్తారని తెలుస్తోంది. కాగా..గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం… 2014లో సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించి.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్కరోజులో ఆ సర్వేను పూర్తి చేసింది. అయితే అందులోని విషయాలను ఇప్పటి వరకూ బయట పెట్టలేదు.

దీంతోనే తాము మరోసారి సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కుల గణనను చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఎలాంటి వివాదాలు లేకుండా, ఆరోపణలు రాకుండా ఈ సర్వేను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలో పారదర్శకతకు పెద్ద పీట వేయడానికి నిర్ణయం తీసుకుంది. దీనికోసం సామాజికవేత్తలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ అనే సంస్థ ప్రతినిధులతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుని.. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు

మొత్తం మూడు వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చిన తర్వాత ఈ సర్వే కోసం వారిని అధికారులు వినియోగించనున్నారు. సర్వే కారణంతో అధికారులు, సిబ్బంది 15 రోజులపాటు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 1.10 కోట్ల కుటుంబాలపై అధికారులు సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో సగం ప్రశ్నలు.. వ్యక్తులు, కుటుంబాలకు సంబంధించినవి మిగిలిన సగం వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించినవి ఉన్నాయి.