తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణకు సంబంధించిన పది అంశాలపై ప్రధానికి లేఖలు అందజేశారు. అలాగే ఈ భేటీ సందర్భంగా ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్ ‘తెలంగాణ భవన్’ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని, యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని సీఎం కోరారు. సీఎం అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారు.
ప్రధానికి సీఎం కేసీఆర్ అందించిన లేఖలు:
1. ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలి.
2. రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి.
3. హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలి.
4. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
5. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలి.
6. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
7. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలి.
8. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలి.
9. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.
10. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.
తెలంగాణ భవన్ కు స్థలం కేటాయించండి:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా, అన్ని రాష్ట్రాలకు ఢిల్లీ కేంద్రంగా భవనాలు వున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా అధికారిక భవనం “తెలంగాణ భవన్” నిర్మించుకునేందుకు, ఢిల్లీలో అనువైన చోట స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని, భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.
యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి ఆహ్వానం:
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా, సీఎం కేసీఆర్ ప్రధానిని ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభమహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ