వినాయక చవితి 7వ తేదీ సెప్టెంబర్ 2024న వచ్చింది. ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చింది అంటే చాలు ఆటలు పాటలు డీజేలు డప్పులు మొదలు, కోలాహలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పండుగకు పెద్దపెద్ద డీజేలు పెట్టి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా డాన్సులు చేస్తూ ఉంటారు. ఇక మరొక ఎనిమిది రోజుల్లో వినాయక చవితి పండుగ రానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా పోలీసు శాఖ వారు కొన్ని ఆంక్షలను విధించారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి ఘర్షణలు, వివాదాలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా కొన్ని తప్పనిసరి చేసింది. మండపం ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలను పోలీస్ శాఖ వెల్లడించింది.
గణేష్ మండపం వేసే వారు తప్పనిసరిగా ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతి పొందాలి. మండపాలతో రోడ్డును మూసివేయరాదు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించరాదు. కనీసం ద్విచక్ర వాహనం వెళ్లేందుకు దారి వదలాలి. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మైక్‌లు ఆఫ్ చేయాలి. రెండు బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలి. రాత్రి 10 గం నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లు వినియోగించరాదు. విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా విద్యుత్ తీసుకుని ప్రమాదాలకు దారితీయకుండా చర్యలు. అగ్నిప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలి.
నిర్వాహకులు మండపం ఏర్పాటుకు పాటించాల్సిన సూచనలు, జాగ్రత్తలు వివరిస్తూనే అనుమతి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీ వరకు https://www.tspolice.gov.in వెబ్‌సైట్ లో నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 87126 65785 నెంబర్ ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా మండపం ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమకు సహకరించాలని కోరారు. శాంతియుత వాతావరణంలో పండుగ చేసుకోవావాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.