తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రేషన్ ద్వారా అందించే బియ్యంలో మార్పు చేస్తూ, ఏప్రిల్ 1వ తేదీ నుంచి పౌష్టికాహారంగా మంచి నాణ్యత కలిగిన సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి అర్హరైన కుటుంబానికి నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందించనున్నారు. ఈ పథకాన్ని అధికారికంగా ఉగాది పండుగ రోజున ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే పథకంగా ప్రభుత్వం ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఈ సన్నబియ్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటివరకు రేషన్ ద్వారా అందించిన దొడ్డుబియ్యం నాణ్యతలేమితో సంబంధించి ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో, నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ పథకం అమలుకు రాష్ట్రానికి సంవత్సరానికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. రైతుల నుండి రెండు సీజన్లలో సేకరించే ధాన్యాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వ పంపిణీ ద్వారా లబ్ధిదారులకు చేరుస్తారు. ఈ పథకం ద్వారా 84% రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలగనుంది. నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు, బ్లాక్ మార్కెట్, రీసైక్లింగ్ వంటి అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇది దేశంలోనే ప్రత్యేకమైన ఆహార భద్రతా కార్యక్రమమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.